FSSAI: ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ‘బిస్క్ ఫామ్’ (Bisk Farm) మాతృ సంస్థ అయిన సాజ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కు భారత ఆహార భద్రత ఇంకా ప్రమాణాల అథారిటీ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది. కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన “ఈట్ ఫిట్ డైజెస్టివ్ బిస్కెట్ల” ప్యాకెట్లపై తప్పుదోవ పట్టించే వాదనలు (Misleading Claims) ఉన్నాయంటూ ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఫుడ్ రెగ్యులేటర్, సదరు కంపెనీకి లీగల్ నోటీసులు జారీ చేసింది. బిస్కెట్ల ప్యాకింగ్, అందులో వాడిన పదార్థాలు ఇంకా కంపెనీ చేసుకుంటున్న మార్కెటింగ్ ప్రచారాలపై FSSAI తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
కంపెనీ తన బిస్కెట్ ప్యాకెట్ ముందుభాగంలో “100% అట్టా” (100 శాతం గోధుమ పిండి) తో తయారైనట్లు పెద్ద అక్షరాలతో ప్రచారం చేసుకుంది. అయితే, ప్యాకెట్ వెనుక వైపు ఉన్న పదార్థాల (ఇంగ్రీడియెంట్స్) జాబితాను పరిశీలించగా అందులో కేవలం 72.33 శాతం మాత్రమే గోధుమ పిండి ఉన్నట్లు, మిగిలిన భాగంలో ఇతర పదార్థాలు ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇది ప్రస్తుత ఆహార భద్రతా నిబంధనల ప్రకారం ముమ్మాటికీ వినియోగదారులను మోసం చేయడమేనని FSSAI స్పష్టం చేసింది.
దీనితో పాటు సదరు బిస్కెట్లలో “నో యాడెడ్ షుగర్” (చక్కెర కలపలేదు) అని కంపెనీ చేసిన వాదన కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ బిస్కెట్ల తయారీలో మాల్టోడెక్స్ట్రిన్ ఇంకా గ్లూకోజ్ సిరప్ సాలిడ్స్ వంటి ప్రత్యామ్నాయ చక్కెర పదార్థాలను ఉపయోగించినట్లు తేలింది. అంతేకాకుండా, అసలు ఈ బిస్కెట్లకు “ఈట్ ఫిట్ డైజెస్టివ్” అనే పేరు పెట్టడానికి గల శాస్త్రీయ ఆధారాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్-2018 ప్రకారం నిరూపించుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై కేవలం 7 రోజుల్లోగా (వారం రోజులు) పూర్తి వివరణ ఇవ్వాలని సాజ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌ను FSSAI ఆదేశించింది. తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీపై ఫుడ్ సేఫ్టీ యాక్ట్-2006 కింద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా కంపెనీ నుంచి సరైన వివరణ రాకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో ఈ బిస్కెట్ల వివాదం ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

