Revanth Reddy

Revanth Reddy: మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’..!

Revanth Reddy: హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు. మూసీ తొలి దశ అభివృద్ధి పనులపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCRHRD) లో శుక్రవారం రాత్రి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే పేదలకు పూర్తి భరోసా కల్పిస్తూనే, ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

మూసీ రివర్‌బెడ్ (నది పరివాహక ప్రాంతం) లో నివసిస్తూ ఇళ్లను కోల్పోతున్న పేద కుటుంబాలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఈ మెగా ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని, లేదా టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. మూసీ నదిని నిరంతరం స్వచ్ఛమైన మంచినీటి ప్రవాహంతో ఉంచడంతో పాటు, ఈ ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా, రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆర్థిక కారిడార్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు.

ఈ ప్రాజెక్టు లక్ష్యాలను, భవిష్యత్తులో మూసీ నది ఎలా రూపాంతరం చెందబోతోందనే విషయాలను ప్రజలకు కళ్లకూ కట్టినట్లు వివరించేందుకు నెక్లెస్ రోడ్డులో ‘మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సెంటర్ ద్వారా ప్రాజెక్టు రూపకల్పనను ప్రదర్శించడమే కాకుండా, దీనిపై సాధారణ ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సలహాలను కూడా స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదే సమయంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ భూసేకరణ ప్రక్రియ సఫలమవడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బాపూఘాట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో 200 ఎకరాల్లో నిర్మించనున్న ఈ గాంధీ సరోవర్ కోసం గోల్కొండ ఆర్టిలరీ పరిధిలోని రూ.533 కోట్ల విలువైన 83.814 ఎకరాల భూములను బదలాయించేందుకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అంగీకరించింది. ఈ భూముల సేకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా రక్షణశాఖతో జరిపిన పలు దఫాల చర్చలు, మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) రాసిన లేఖలు ఫలించాయి. ఈ ఏడాది మార్చిలోనే రక్షణశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ భూముల బదిలీకి పచ్చజెండా ఊపారు. భూముల బదలాయింపునకు ఓకే చెప్పిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత ఆర్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రక్షణ శాఖ నుంచి తీసుకుంటున్న ఈ భూముల్లో ఉన్న పాత నిర్మాణాలను సురక్షితంగా తరలించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *