Bhagyaraj Passes Away: తమిళ చిత్రసీమలో కోలుకోలేని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథల రారాజుగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా దశాబ్దాల పాటు దక్షిణాది సినిమాపై చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్‌ప్లే రాయడంలో భాగ్యరాజ్‌ది ఒక ప్రత్యేకమైన శైలి. సామాన్య మధ్యతరగతి కుటుంబాల కథలను, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆయన ఎన్నో ట్రెండ్ సెట్టర్ సినిమాలను అందించారు. లెజెండరీ దర్శకుడు భారతీరాజా వద్ద ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ మెరిశారు. ఆ తర్వాత 1979లో ‘సువరిల్లాద చిత్రంగళ్’ సినిమాతో మెగాఫోన్ పట్టి పూర్తిస్థాయి దర్శకుడిగా మారారు. కెరీర్ మొత్తంలో 25 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన, 75 చిత్రాల్లో నటుడిగా విభిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఆయన హీరోగా, దర్శకుడిగా చేసిన ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ‘అన్థా 7 నాట్కళ్’ (తెలుగులో రాధా కళ్యాణం), ‘ముంధానై ముడిచ్చు’ (తెలుగులో మూఢు ముళ్లు), ‘దూరల్ నిన్ను పోచ్చు’ వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్‌లుగా నిలిచాయి.
భాగ్యరాజ్ సృష్టించిన అద్భుతమైన కథలు కేవలం తమిళానికే పరిమితం కాకుండా తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయి అక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఆఖరి రాస్తా’ చిత్రానికి భాగ్యరాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఆయన వ్యక్తిగత జీవిత విషయాలకొస్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్ ఆయన స్వస్థలం. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకోగా, దురదృష్టవశాత్తూ 1983లోనే ఆమె కామెర్ల వ్యాధితో కన్నుమూశారు. ఆ తర్వాత 1984లో నాటి స్టార్ హీరోయిన్ పూర్ణిమ జయరామ్‌ను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ తెలుగులో ‘మగమహారాజు’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా, కొడుకు శంతను భాగ్యరాజ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరోగా రాణిస్తుండగా, కుమార్తె శరణ్య ‘పారిజాతం’ వంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. సౌత్ ఇండియన్ సినిమా ఒక గొప్ప కథకుడిని, అద్భుత నటుడిని కోల్పోయిందని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
