Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక పెద్ద చట్టపరమైన వివాదం ముసురుకుంది. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు (ఓటర్ ఐడీలు) కలిగి ఉన్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో బెంగళూరు కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. వరుస సమన్లకు స్పందించకపోవడంతో ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేసింది.
అసలు వివాదం ఎప్పుడు మొదలైంది?
2019లో స్టార్ట్ అయిన వివాదం బెంగళూరుకు చెందిన అడ్వకేట్ దిలీప్ కుమార్ హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ప్రకాష్ రాజ్‌పై ఒక ఫిర్యాదు చేశారు. భారత ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం దేశంలోని ఏ పౌరుడికైనా ఒకే ఒక్క ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలి. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం చట్ట విరుద్ధంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారని సదరు న్యాయవాది ఆరోపించారు.
కోర్టు సీరియస్ – నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు?:
ఈ వ్యవహారంపై పోలీసులు, ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోకపోవడంతో అడ్వకేట్ దిలీప్ కుమార్ బెంగళూరులోని 48వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
-
సమన్‌లను లైట్ తీసుకున్న నటుడు: ఈ ప్రైవేట్ పిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. కేసు విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్‌కు రెండుసార్లు కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
-
కోర్టు కఠిన నిర్ణయం: కోర్టు ఆదేశాలను గౌరవించకుండా ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం పోలీసులు ఆయన్ను ఎప్పుడైనా అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
రంగంలోకి దిగిన మీమర్స్:
సామాన్యులకు తాము ఉండే ఊర్లోనే ఓట్లు గల్లంతవుతుంటే, ప్రకాష్ రాజ్‌కు ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, మీమర్స్ రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ రాజకీయ, సామాజిక అంశాలపై నిత్యం బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రకాష్ రాజ్.. మరి ఈ సంచలన లీగల్ చిక్కుల నుంచి ఎలా బయటపడతారో, దీనిపై చట్టపరంగా ఎలా ఫైట్ చేస్తారో చూడాలి.
