Sai Krishna: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం (మిస్సింగ్) ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో స్థానిక పోలీసులపై వస్తున్న తీవ్ర ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్యుడైన కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం హైలెవెల్ రివ్యూ:
సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు హాజరయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ ద్వారా అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ఈ కేసుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై తక్షణ చర్యలకు ఆదేశిస్తూ, కేసును ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు.
ఈ ఘటనలో బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని, ప్రజా రక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీస్ బాస్లకు సూచించారు.
నా కొడుకును పోలీసులే చంపేశారు.. కోర్టుకెక్కిన బాధితుడి తల్లి!
ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన కొడుకును కృష్ణలంక పోలీసులే స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి, కొట్టి చంపేశారని ఆమె ఆరోపిస్తున్నారు.
“నా కొడుకు బతికుంటే నాకు చూపించండి.. లేదంటే కనీసం వాడి శవాన్ని అయినా మాకు అప్పగించండి” అంటూ ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే కృష్ణలంక పీఎస్ (Police Station) లోని సీసీటీవీ ఫుటేజ్, అలాగే కాల్ డేటాను వెంటనే భద్రపరచాలంటూ విజయలక్ష్మి విజయవాడ రెండో ఏజేఎం (AJM) కోర్టులో పిటిషన్ వేశారు. సీఐ నాగరాజు తన ఫోన్ లాక్కుని కాల్స్ చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఐపీఎస్ విచారణ షురూ – కృష్ణలంక పీఎస్‌కు రాజమండ్రి ఎస్పీ:
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ సున్నితమైన కేసు విచారణ బాధ్యతలను రాజమండ్రి ఎస్పీ (ఐపీఎస్) నరసింహ కిషోర్‌కు అప్పగించారు. విచారణలో భాగంగా ఐపీఎస్ అధికారి నరసింహ కిషోర్ నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను స్వయంగా సందర్శించి, రికార్డులను, లభ్యమైన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
