Mumbai

Mumbai లో నీటి ముప్పు.. ఎండిపోతున్న సరస్సులు.. మరో 40 రోజులకు మాత్రమే సరిపోయే నీరు!

Mumbai: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరానికి ఈ ఏడాది వర్షాకాలం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా జూన్ 11 నాటికే రావాల్సిన రుతుపవనాలు.. ఈ జూన్ సగం ముగిసినా ఇంకా నగరాన్ని తాకలేదు. తాజా వాతావరణ అంచనాల ప్రకారం ఈ నెల 25 లేదా ఆ తర్వాతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏకంగా 79 శాతం వర్షపాత లోటు నమోదైంది.

ముంబై నగరానికి తాగునీరు అందించే భాట్సా, తాన్సా, తులసితో కూడిన 7 ప్రధాన సరస్సులలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ సరస్సులలో వాటి మొత్తం సామర్థ్యంలో కేవలం 10.72 శాతం నీరు మాత్రమే మిగిలి ఉంది.

సరస్సులు ఉన్న ప్రాంతాల్లో అసలు వర్షాలు పడకపోవడంతో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అప్రమత్తమైంది. త్వరలో భారీ వర్షాలు పడకపోతే, ఇప్పుడున్న నీరు కేవలం మరో 40 రోజులకు మాత్రమే సరిపోతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా మే 15 నుంచే నగరంలో 10 శాతం నీటి సరఫరాను ప్రభుత్వం తగ్గించింది.

ఉపశమనం ఎప్పుడు?:

వాతావరణ నిపుణుల ప్రకారం.. జూన్ 20 తర్వాత అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు బలంగా మారే అవకాశం ఉంది. అప్పుడు రుతుపవనాలు మళ్లీ పుంజుకుని ముంబైలో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. అప్పటివరకు ముంబై ప్రజలు ఉక్కపోతతో పాటు నీటి కోసం నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *