Revanth Reddy: తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణం అనేది కేవలం రాజకీయ సభల్లో లేదు.. అది క్లాస్‌రూమ్‌లలోనే ఉంది. విద్యతోనే సమాజంలో మార్పు, ఆర్థిక అసమానతల తొలగింపు సాధ్యమవుతుంది” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలు, కార్పొరేట్ వసతులతో నిర్మించిన రాష్ట్ర తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS) ను సీఎం బుధవారం ప్రారంభించారు. స్మారక పైలాన్‌ను ఆవిష్కరించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త జోష్‌తో స్కూల్ అంతటా పర్యటించి చిన్నారులతో కలిసి సందడి చేశారు.
క్లాస్‌రూమ్‌లో రేవంత్.. గ్రౌండ్లో ఫుట్‌బాల్ హల్చల్:
పాఠశాల ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చం ఒక విద్యార్థిలా మారిపోయి క్యాంపస్ అంతా కలియతిరిగారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పాఠశాల ఫుట్‌బాల్ మైదానాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, కోటు పక్కనబెట్టి విద్యార్థులతో కలిసి స్వయంగా ఫుట్‌బాల్ ఆడారు. సీఎం బంతిని గాల్లోకి కిక్ చేస్తూ పిల్లలను ఉత్సాహపరచడం అక్కడ పెద్ద ఆకర్షణగా నిలిచింది.
ఆ తర్వాత స్కూల్లోని డాన్స్, మ్యూజిక్ రూమ్‌లతో పాటు ప్రీ-ప్రైమరీ విభాగాలను సందర్శించి చిన్నారుల విద్యా వాతావరణాన్ని పరిశీలించారు. లైబ్రరీ, డిజిటల్ తరగతి గదులు, ఇన్నోవేషన్ ల్యాబ్‌తో పాటు ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన రేవంత్ రెడ్డి.. అక్కడ అందుతున్న విద్యా ప్రమాణాలపై అధికారులు, ఉపాధ్యాయులతో ఆరా తీశారు.
స్కూల్ గేటుపై ‘నో వేకెన్సీ’ బోర్డు – ఇదే మా సక్సెస్!
అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థపై తన మార్క్ విజన్‌ను పంచుకున్నారు.
తల్లిదండ్రుల నమ్మకం: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే చదువు సరిగ్గా రాదనే ఒక బలమైన అనుమానం గతంలో తల్లిదండ్రుల్లో ఉండేది. ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చడానికే కార్పొరేట్ స్థాయి వసతులతో టీపీఎస్‌లను తెచ్చాం. మన విద్యాశాఖ కమిటీ సభ్యులు ఇతర దేశాలు, పక్క రాష్ట్రాల్లో పర్యటించి ఒక అద్భుతమైన నివేదికను తయారుచేశారు.”
సంచలన అడ్మిషన్లు: దానికి నిదర్శనమే.. నర్సరీ నుండి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందించే ఈ ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే 1800 మంది చేరారు. ఇప్పుడు స్కూల్ బయట ‘ఖాళీలు లేవు’ (No Vacancy) అని బోర్డు పెట్టారంటేనే ఈ స్కూల్ క్రేజ్ ఏంటో, మా విద్యా విధానం ఎంతలా సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) – సీఎం రేవంత్ త్రీ-పాయింట్ విజన్:
ప్రస్తుతం మా ప్రభుత్వం విద్యాశాఖ బలోపేతానికి ఏకంగా రూ.27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. పైలట్ మోడల్‌గా ఆరుట్లను అభివృద్ధి చేశాం. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో 100 స్కూళ్లు డెవలప్ చేయడమే కాకుండా, త్వరలోనే మరో 3 టీపీఎస్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకువస్తాం.
సమాజంలో కులాల వారీగా వేర్వేరుగా హాస్టళ్లు నిర్మించడం మంచి పద్ధతి కాదు. అందుకే ఈ టీపీఎస్‌లలో కులమతాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకేచోట కలిసి చదువుకుంటారు. ఇందులో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, మోడరన్ ల్యాబ్‌లతో పాటు ప్రత్యేక డైనింగ్ హాల్, జిమ్నాజియం సౌకర్యాలు ఉన్నాయి.
సౌత్ కొరియాలో కేవలం 30 ఎకరాల్లో ఉన్న ఒక యూనివర్సిటీ విద్యార్థులు ఒలింపిక్స్‌లో 30 మెడల్స్ సాధిస్తే, 140 కోట్ల జనాభా ఉన్న మన భారత్‌కు ఎన్ని రావాలి? అందుకే 2034 ఒలింపిక్స్ నాటికి తెలంగాణ విద్యార్థులు గ్లోబల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ సాధించేలా క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, వాలీబాల్, కబడ్డీలలో ఇక్కడి పిల్లలకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తాం.
మెస్సీ కామెంట్స్.. అవినీతి ఆరోపణలపై సీఎం తీవ్ర ఆగ్రహం:
ఉప్పల్ స్టేడియం టెండర్లు మరియు క్రీడల అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.
ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మన తెలంగాణ బిడ్డలు ఆడే రోజు రావాలని నేను ఆకాంక్షిస్తే.. కొందరు దానిపై కూడా చవకబారు రాజకీయ విమర్శలు చేశారు. క్రీడా మైదానాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ.600 కోట్లకు టెండర్లు పిలిస్తే.. అందులో ఏకంగా రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. పిలిచిన టెండర్ విలువ రూ.600 కోట్లు అయితే.. అందులో రూ.3,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ఉన్నత చదువులు చదువుకున్న ఆ మేధావులకే తెలియాలి. ఇలాంటి బురదజల్లే రాజకీయాలను పక్కనబెట్టి, తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా మార్చడమే మా ఏకైక లక్ష్యం” అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
