Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్‌ఐ’ (ANI) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేశ రాజకీయాలు, ఉచిత పథకాలు, కులాల రాజకీయం, హైదరాబాద్‌లో తన పర్యటనలపై వస్తున్న విమర్శలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మోడీ నాయకత్వం.. ఉచిత పథకాలపై స్పష్టత
ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఒకతాటిపైకి తెచ్చిన గొప్ప నాయకుడని పవన్ కల్యాణ్ కొనియాడారు. తాను మోడీతో మాట్లాడే ప్రతిసారీ కేవలం దేశ ప్రయోజనాల గురించే చర్చిస్తామని చెప్పారు. ఇక ఉచిత పథకాల గురించి మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సహాయం ఖచ్చితంగా అవసరమని, కానీ కేవలం ఓట్ల కోసం విచక్షణారహితంగా ఉచితాలు ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన ఏ కులం వల్ల ఆ స్థాయికి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

నక్సలైట్ కావాలనుకున్నా.. అన్నయ్య మార్చారు
తన చిన్నతనంలో సమాజంలోని పరిస్థితులను చూసి నక్సలైట్ కావాలనే ఆలోచన తన మనసులోకి వచ్చిందని పవన్ కల్యాణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అయితే తన అన్నయ్య చిరంజీవి తనను సరైన దారిలో నడిపించారని, సమాజానికి మంచి చేసే మార్గాన్ని చూపించారని గుర్తుచేసుకున్నారు. నేటి యువత కూడా గొడవలకు, విధ్వంసాలకు దూరంగా ఉంటూ సమస్యలకు సరైన పరిష్కారాలు వెతికేలా ఆలోచించాలని ఆయన కోరారు.

ఉత్తర – దక్షిణాది వివాదంపై వ్యాఖ్యలు
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కొన్ని అనుమానాలు, ఆందోళనలు ఉండటం సహజమేనని పవన్ ఒప్పుకున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా గొడవలు చేయడం కరెక్ట్ కాదన్నారు. దేశాన్ని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని విడదీసి చూడటం దేశానికి మంచిది కాదని హితవు పలికారు. కొందరు ముఖ్యమంత్రులే ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు.

తెలంగాణ రాజకీయాలపై ప్రస్తుతానికి ఆసక్తి లేదు
తన పూర్తి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైనే ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు!
హైదరాబాద్‌లో తన పర్యటనలపై వస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “నా దేశంలో నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకు ఉంది. హైదరాబాద్ రావడానికి నాకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సభ పెట్టుకోవడానికి తనకు పర్మిషన్ ఇవ్వలేదని, తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమంటూ బెదిరింపులు కూడా వచ్చాయని ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు ఎక్కువయ్యాయని పవన్ కల్యాణ్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *