Pawan Kalyan: విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదానికి కట్టుబడి ఉన్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) ప్రైవేటీకరణ జరగకూడదన్నదే తమ కూటమి ప్రభుత్వ నిశ్చిత ఆకాంక్ష అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం, ఆయన నేరుగా స్టీల్ ప్లాంట్‌కు చేరుకుని ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ప్లాంట్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా మాట్లాడి ప్రమాద వివరాలు, దానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి ప్రమాదం జరగలేదు!
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టకరమైన రోజు అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 33 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘోర ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. లాడిల్ పేలుడు కారణంగా 8 మంది కార్మికులు చనిపోవడం అత్యంత బాధాకరం, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో పోరాడుతున్నారు.ఇలాంటి ఘటనలు ప్రపంచంలో ఎక్కడైనా జరిగాయా అని అధికారులను అడిగితే.. గతంలో చైనా, ఫ్రాన్స్ దేశాల్లో పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి కానీ, ఈ తరహా భీకర లాడిల్ పేలుడు ఎక్కడా జరగలేదని తెలిసింది. ఈ ఘోర దుర్ఘటనపై నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం ‘త్రీమెన్ కమిటీ’ (ముగ్గురు సభ్యుల కమిటీ) ని ఏర్పాటు చేసిందని, ఈ విచారణ కమిటీ సమగ్ర దర్యాప్తు జరిపి అన్ని వివరాలను రాబడుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
క్షతగాత్రుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది.. భారీ ప్యాకేజీ!
బాధిత కుటుంబాలకు కొండంత అండగా ఉంటామని హామీ ఇస్తూ పవన్ కల్యాణ్ పరిహారం మరియు భరోసా ప్యాకేజీని ప్రకటించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో నష్టపోయిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు సుమారు రూ. 1.72 కోట్లు, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు రూ. 45.75 లక్షల చొప్పున అందేలా చూస్తామన్నారు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున తక్షణ పరిహారం ఇవ్వడంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా, సదరు కుటుంబాలు వారి రిటైర్మెంట్ వయస్సు పరిధి వచ్చే వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోనే ఉచితంగా కొనసాగవచ్చని స్పష్టం చేశారు.
వైసీపీ అమ్మాలని చూసింది.. స్టీల్ ప్లాంట్ కోసం ఒక రోజు కేటాయిస్తా!
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించారు.
గత వైసీపీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ముంచేసి, దానిని ప్రైవేట్ పరంగా అమ్మేయాలని చూశారు. కానీ మా కూటమి ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా అందరి బలమైన ఆకాంక్ష. ఈ సంస్థకు పాత వైభవం రావాలి, దీనికి తక్షణమే ‘ఆధునికీకరణ’ (Modernization) జరగాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ – కార్మికుల రక్షణే ముఖ్యం
ఫ్యాక్టరీల నిర్వహణ, ప్రభుత్వ యంత్రాంగ పర్యవేక్షణపై తాము త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, వారి భద్రతా ప్రమాణాలపై యాజమాన్యంతో గట్టిగా చర్చిస్తానని చెప్పారు. “త్వరలోనే కార్మికులను నేనే స్వయంగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటాను. స్టీల్ ప్లాంట్ అవసరాలు, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం నా షెడ్యూల్‌లో ఒక రోజంతా ప్రత్యేకంగా కేటాయిస్తా. విచారణ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే దీనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ముందుకు వెళ్తాం” అని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
