TG EAPCET 2026

TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

TG EAPCET 2026: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్. టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) మొదటి విడత కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఎప్‌సెట్ ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మొదటగా విద్యార్థులు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి, తమ సర్టిఫికెట్ల  వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్ణీత కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు.

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఆన్‌లైన్ లో ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా వచ్చే నెల 4వ తేదీన ‘మాక్ సీట్ అలాట్‌మెంట్’  చేస్తారు. దీనివల్ల తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో విద్యార్థులకు ముందే ఒక అంచనా వస్తుంది.

మాక్ అలాట్‌మెంట్ చూసుకున్న తర్వాత, విద్యార్థులు తాము పెట్టిన ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే వచ్చే నెల 5 నుండి 7వ తేదీ వరకు మార్చుకునే అవకాశం కల్పించారు. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాత, వచ్చే నెల 10వ తేదీన మొదటి విడత అసలు ఫైనల్ అలాట్‌మెంట్ జరుగుతుంది. సీటు సాధించిన విద్యార్థులు వచ్చే నెల 10 నుండి 14వ తేదీ లోపు ఆన్‌లైన్ లో ఫీజు చెల్లించి, కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *