Crime News

Crime News: పిజ్జా డెలివరీ చేస్తుండగా కాల్పులు.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

Crime News: అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఎంబీఏ విద్యార్థి కుంచ అన్షుల్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియాలో దారుణ హత్యకు గురయ్యాడు. టెంపుల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న అన్షుల్, తన చదువు ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌గా పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం (జూన్ 6) అర్ధరాత్రి సమయంలో డెలివరీకి వెళ్లిన అన్షుల్‌ను గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఫిలడెల్ఫియాలోని ఒక ఖాళీ ఇంటికి మూడు పిజ్జా బాక్సులను డెలివరీ చేసి అన్షుల్ బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు అతడిని వెంబడించి, తల వెనుక భాగంలో అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో మూడు తూటాల ఖాళీ గుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అన్షుల్‌ను వెంటనే టెంపుల్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అన్షుల్ మరణవార్త వినగానే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లిలోని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో కూడా తమ కుటుంబంలో ఇలాంటి దోపిడీ జరిగిందని, ఈ హత్య వెనుక పెద్ద ప్లాన్ ఉండి ఉండవచ్చని అన్షుల్ సోదరి అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే అన్షుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంత ఊరికి తీసుకురావడానికి సహాయం చేయాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ ఘటనతో అమెరికాలోని తెలుగు విద్యార్థుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *