KTR: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు చరితను, దశాబ్దాల కాంగ్రెస్ ద్రోహాలను గుర్తుచేస్తూనే.. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనను, పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాద వ్యాఖ్యలను ఆయన ఎండగట్టారు.
తెలంగాణ కథలో నెం.1 విలన్ కాంగ్రెస్సే
తెలంగాణ దశాబ్దాల పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో సాకారమైందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఆయన లిస్ట్ అవుట్ చేశారు:
1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను బలవంతంగా కలిపింది కాంగ్రెస్సే. ఆ తర్వాత జరిగిన 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 370 మంది అమాయకులను బలిగొన్నది కూడా కాంగ్రెస్సే.
2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ (నాడు టీఆర్ఎస్) తో పొత్తు పెట్టుకుని నమ్మించి, ఆ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా మాట తప్పింది. చివరకు తట్టుకోలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, అందుకే తెలంగాణ కథలో నెం.1 విలన్ కాంగ్రెస్సేనని కేటీఆర్ విమర్శించారు.
అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని.. దేశానికే అన్నం పెట్టేలా చేశాం
గత కేసీఆర్ పాలనలోని ప్రగతిని, ప్రస్తుత కాంగ్రెస్ చేతకానితనాన్ని కేటీఆర్ పోల్చి చూపించారు:
ఒకప్పుడు ‘అన్నమో రామచంద్ర’ అంటూ ఆకలితో అలమటించిన రాష్ట్రాన్ని.. దేశానికే అన్నంపెట్టే స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లారు. కేసీఆర్ తెచ్చిన ‘రైతుబంధు’ అనే విప్లవాత్మక పథకాన్ని చివరకు కేంద్ర ప్రభుత్వం (పీఎం కిసాన్ రూపంలో) కాపీ కొట్టింది.
తలసరి ఆదాయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించి పరిపాలనలో దేశానికే కొత్త పాఠాలు నేర్పారు.
దేశంలో కేవలం 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ.. దేశానికి 5 శాతం జీడీపీ (GDP) ని ఇచ్చింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో మా కంటే ఎవరైనా బాగా చేశారని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ సర్కార్‌పై ఘాటు విమర్శలు.. ఢిల్లీకి ‘ధనం సంచులు’!
ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ఎద్దేవా చేస్తూ కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘మందుగమనం జోరుగా.. మిగతాదంతా మందగమనం’లా సాగుతోంది. నినాదాలు మాత్రమే రైజింగ్ (Rising) లో ఉన్నాయి, డెవలప్మెంట్ మాత్రం డౌనింగ్ (Downing) లో ఉంది. ఈ ప్రభుత్వానికి రైతులకు ధాన్యం సంచులు కొనడం చేతకాదు గానీ.. ఢిల్లీ పాలకుల కోసం ‘ధనం సంచులు’ మోయడం మాత్రం బాగా తెలుసు. తెలంగాణవాదుల మీదికి నాడు తుపాకీ పట్టుకున్న వ్యక్తి ఇవాళ సీఎం కావడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం.
హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని చెప్పిన కేటీఆర్.. గతంలో తాము ఫార్మాసిటీ కోసం కండిషనల్‌గా మాత్రమే భూసేకరణ చేశామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’ అంటూ డ్రామాలాడుతోందని విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పొరపాటుగానే మాట్లాడారని.. అయితే ఆయనపై కేసులు పెట్టారు కానీ, కాంగ్రెస్ నేతల అరాచకాలపై చర్యలు లేవని మండిపడ్డారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్.. తెలంగాణకు ఓజీ (OG) కేసీఆరే!
హైదరాబాద్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు:
-
పోటీ చేయొద్దని ఎవరన్నారు?: పవన్ కల్యాణ్‌ను తెలంగాణలో పోటీ చేయొద్దని ఇక్కడ ఎవరన్నారు? ఆయన్ని ఎవరు అడ్డుకున్నారు? 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఇక్కడ పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. పవన్ సభను అడ్డుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ తాము కాదన్నారు.
-
తెలంగాణకు ఓజీ కేసీఆరే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందన్న కేటీఆర్.. కానీ మాకు దేశభక్తి గురించి పవన్ నేర్పాల్సిన అవసరం లేదు. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదమంటారా? నాడు పొట్టి శ్రీరాములు గారు ప్రాణా త్యాగం చేసింది ప్రాంతీయవాదం కోసమే కదా! తెలంగాణ భూమి ఇక్కడి నాలుగు కోట్ల మంది భూమి పుత్రుల జాగీరే. ఈ రాష్ట్రానికి అసలైన ‘ఓజీ’ కేసీఆర్ గారే అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
