Fire Accident

Fire Accident: విజయవాడ హైవేపై తగలబడ్డ బస్సు.. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డ 36 మంది!

Fire Accident: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్ద రోడ్డుపై వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ‘రెయిన్‌బో ట్రావెల్స్’ బస్సు పెద్దకాపర్తి సమీపంలోకి రాగానే, ఇంజన్ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. క్షణాల్లో బస్సును రోడ్డు పక్కన ఆపి, లోపల ఉన్న ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దిగిపోవాలని గట్టిగా అరిచాడు. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు కంగారుగా బస్సులోంచి కిందకు దూకేశారు.

ప్రయాణికులు కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కానీ, అప్పటికే బస్సు అస్థిపంజరంలా మారిపోయింది. ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ, బస్సు డిక్కీలో ఉన్న వారి బ్యాగులు, ఇతర సామాన్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *