Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: ధాన్యం తడిసినా దిగులు వద్దు.. మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం

Uttam Kumar Reddy: రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన ధాన్యం కొనుగోళ్లపై ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వడ్ల కొనుగోలు ఎలా జరుగుతుందో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మంత్రులకు వివరించారు. ఈ సమావేశానికి ముందే మంత్రుల బృందం యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లి ఐకేపీ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

వచ్చే నాలుగు రోజుల పాటు అధికారులు, సిబ్బంది అంతా చాలా అలర్ట్‌గా ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎలాంటి నష్టం జరగకుండా వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ లారీలు, ట్రాక్టర్లను వాడుకోవచ్చని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 1 నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కొందరు ప్రతిపక్ష నాయకులు కేవలం రాజకీయం కోసమే యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.

మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. బీజేపీ నాయకులు ఇక్కడ బస్సు యాత్రలు చేయడం కాదు, దిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోళ్లకు రావాల్సిన నిధులను తీసుకురావాలని సవాల్ విసిరారు. అసలు వడ్ల గురించి కనీస అవగాహన లేని వాళ్లు కూడా ఈరోజు రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గతంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసి రోడ్లపై తిప్పిన బీఆర్‌ఎస్‌ నాయకులు, ఇప్పుడు రైతులపై లేని ప్రేమను నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *