ED Raids

ED Raids: మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. అవినీతి కేసులో ఇరుకున్న కూతురు

ED Raids: కేరళ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఉదయం నుంచే కేరళవ్యాప్తంగా విరుచుకుపడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ సీపీఎం నేత పినరయి విజయన్ నివాసంతో పాటు రాష్ట్రంలోని మొత్తం 10 కీలక ప్రాంతాలలో ఈడీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఈ అవినీతి స్కామ్‌లో విజయన్ కుమార్తె టి. వీణ ప్రధాన నిందితురాలిగా ఉండటంతో ఈ దాడులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సీఎంఆర్‌ఎల్ (CMRL) కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన మరుసటి రోజే, దర్యాప్తు సంస్థ ఈ రేంజ్ యాక్షన్‌లోకి దిగడం గమనార్హం.

అల్లుడి ఇంట్లోనూ సోదాలు.. సీఎం కుటుంబం చుట్టూ ఈడీ ఉచ్చు!

ఈడీ బృందాలు కేవలం మాజీ సీఎం ఇల్లే కాకుండా.. కోజికోడ్‌లోని కేరళ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పి.ఎ. ముహమ్మద్ రియాస్ నివాసంపై కూడా దాడులు చేశాయి. ఈయన పినరయి విజయన్ కుమార్తె టి. వీణకు భర్త (అల్లుడు). విజయన్ కుమార్తెకు చెందిన ‘ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Exalogic Solutions) సంస్థ చుట్టూ జరుగుతున్న ఆర్థిక అక్రమాలపైనే ఈ దాడులు కొనసాగుతున్నట్లు జాతీయ వార్తా సంస్థ ‘ANI’ స్పష్టం చేసింది. సింథటిక్ రూటైల్ మరియు పారిశ్రామిక రసాయనాల తయారీలో దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన సీఎంఆర్‌ఎల్.. లంచాలు, మనీ లాండరింగ్‌కు పాల్పడిందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.

అసలు ఏంటి ఈ ‘సీఎంఆర్‌ఎల్’ (CMRL) స్కామ్?

ఈ భారీ అవినీతి వ్యవహారం 2023 ఆగస్టులో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. కేరళ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ’ (KSIDC) కి ఈ సీఎంఆర్‌ఎల్ కంపెనీలో 13.4 శాతం వాటా ఉంది.

ప్రధాన ఆరోపణలు ఇవే:

  • సేవలు లేవు.. కానీ కోట్లలో పేమెంట్లు: మాజీ సీఎం కుమార్తె వీణకు చెందిన ‘ఎక్సాలోజిక్ సొల్యూషన్స్’ సంస్థ సీఎంఆర్‌ఎల్ కంపెనీకి ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేదా ఐటీ సేవలు అందించలేదు. అయినప్పటికీ 2017 – 2020 మధ్య కాలంలో సీఎంఆర్‌ఎల్ నుండి ఎక్సాలోజిక్ సంస్థకు రూ. 1.72 కోట్లు అక్రమంగా బదిలీ అయ్యాయి.

  • ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) రంగప్రవేశం: ఈ నివేదికలు బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వం దీనిపై ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ (SFIO) చేత సమగ్ర దర్యాప్తు జరిపించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ తన 160 పేజీల ఛార్జ్‌షీట్‌లో వీణ, సీఎంఆర్‌ఎల్ ఎండీ శశిధరన్ కార్తాతో పాటు మరో 25 మందిని నిందితులుగా చేర్చింది.

  • మరో రూ. 2.70 కోట్ల లింక్: ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తులో వీణ సంస్థకు సీఎంఆర్‌ఎల్ నుండి రూ. 2.70 కోట్లు అందినట్లు తేలింది. ఆదాయపన్ను శాఖ (Income Tax) కూడా గతంలోనే ఉద్యోగుల వాంగ్మూలాల ఆధారంగా రూ. 1.72 కోట్ల అక్రమ చెల్లింపులను ధృవీకరించింది.

10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం!

ఈ అక్రమ నిధుల బదిలీ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గతేడాది (2025 ఏప్రిల్‌లో) టి. వీణపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీల చట్టం, 2013 లోని అత్యంత కఠినమైన ‘సెక్షన్ 447’ (కార్పొరేట్ మోసాలు) కింద వీణపై కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే కనీసం ఆరు నెలల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా, జరిగిన మోసం లేదా అవినీతి విలువకు ఏకంగా మూడు రెట్లు భారీ జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.

ఈ కేసులో మాజీ సీఎం పినరయి విజయన్ పేరు నేరుగా నిందితుల జాబితాలో లేనప్పటికీ.. ఆయన సొంత ఇల్లు, కుమార్తె మరియు అల్లుడిపై ఏకకాలంలో ఈడీ దాడులు జరగడం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ (CPIM) దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం మాజీ సీఎం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *