Octopus: ప్రకృతి సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా జంతు ప్రపంచంలో ఒక కొత్త జీవికి జన్మనివ్వడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అయితే, ఈ భూమిపై ఒక విచిత్రమైన జీవి ఉంది.. దాని ప్రెగ్నెన్సీ జంతు ప్రపంచంలోనే అత్యంత విచారకరమైనదిగా మారుతుంది. ఎందుకంటే, ఆ జీవి తన బిడ్డలకు జన్మ ఇవ్వడం కోసం.. తల్లి, తండ్రి ఇద్దరూ తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి ఉంటుంది! అవును, మనం మాట్లాడుకుంటోంది సముద్ర గర్భంలో జీవించే ‘ఆక్టోపస్’ (Octopus) గురించి.
ఒక కొత్త తరం ఆక్టోపస్‌లు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఆ తల్లిదండ్రులు చేసే ప్రాణ త్యాగం గురించిన పూర్తి వివరాలు వింటే నిజంగా కన్నీళ్లు ఆగవు.
మేటింగ్ ముగియగానే తండ్రి ఆక్టోపస్ కథ ముగింపు..
ఆక్టోపస్‌ల జీవిత చక్రంలో సంతానోత్పత్తి ప్రక్రియే వాటి మరణానికి దారితీస్తుంది. ఆడ, మగ ఆక్టోపస్‌ల మధ్య మేటింగ్ (Mating) ప్రక్రియ ముగిసిన వెంటనే.. మగ (Male) ఆక్టోపస్ మెదడు నెమ్మదిగా పనిచేయడం ఆగిపోతుంది. దాంతో అది సముద్రంలో పిచ్చిదానిలా దిక్కుతోచకుండా తిరుగుతూ ఉంటుంది. చివరికి ఏదైనా పెద్ద సముద్ర జంతువుకు దొరికిపోయే వరకు అలాగే ఉండి, దానికి ఆహారంగా మారి ప్రాణాలు కోల్పోతుంది. అంటే, బిడ్డలను చూడకుండానే తండ్రి ఆక్టోపస్ కథ అక్కడితో ముగిసిపోతుంది.
గుడ్లను కాపలా కాస్తూ.. కొన్ని నెలల పాటు పస్తులుండే తల్లి!
ఇక మదర్ ఆక్టోపస్ కథ వింటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. మేటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆడ ఆక్టోపస్ నీటి అడుగున సురక్షితంగా ఉండే ఒక గుహలోకి వెళుతుంది. అక్కడ అది వందల, వేల సంఖ్యలో గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లన్నింటికీ సముద్రపు నీటి ద్వారా నిరంతరం ఆక్సిజన్ అందడం కోసం.. వాటిపై తన శరీరంతో నిరంతరాయంగా నీళ్లను స్ప్రే చేస్తూ అప్రమత్తంగా కాపలా కాస్తుంది.
అయితే, ఆ గుడ్లను ఇతర శత్రు జీవుల నుండి రక్షించే క్రమంలో.. ఆ తల్లి ఆక్టోపస్ కొన్ని నెలల పాటు అస్సలు ఏమీ తినదు! కనీసం వేటాడటానికి కూడా ఆ గుహను వదిలి బయటకు రాదు.
సైన్స్‌లో ‘Senescence Process’.. ఏకంగా 4.5 ఏళ్ల పాటు పస్తులు!
ఈ విచిత్రమైన పరిస్థితిని సైన్స్ లో ‘సెనెసెన్స్ ప్రాసెస్’ (Senescence Process) అంటారు. గుడ్లు పెట్టిన తర్వాత తల్లి ఆక్టోపస్ శరీరంలో తీవ్రమైన హార్మోన్ మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల అది ఆకలితో అలమటిస్తూ, తీవ్రమైన ఒత్తిడికి లోనై కొన్నిసార్లు తనని తనే గాయపరుచుకుంటుంది.
ఇక ఆక్టోపస్లలోని ఒక ప్రత్యేక జాతి అయితే.. గుడ్ల రక్షణ కోసం ఏమీ తినకుండా ఏకంగా 53 నెలల పాటు (దాదాపు 4.5 సంవత్సరాలు) కాపలా కాసి సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది!
పిల్లలు బయటకు వచ్చే క్షణంలోనే తల్లి మరణం..
ఈ కథలో అన్నింటికంటే అత్యంత విచారకరమైన ట్విస్ట్ ఏంటంటే.. కొన్ని నెలలు లేదా సంవత్సరాల నిరంతర నిరాహార దీక్ష తర్వాత, ఆ గుడ్ల నుండి బుజ్జి ఆక్టోపస్ పిల్లలు బయటికి వచ్చే సరిగ్గా అదే క్షణంలో.. ఆ తల్లి ఆక్టోపస్ పూర్తిగా నీరసించిపోయి ప్రాణాలు విడిచేస్తుంది!
కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో.. పుట్టిన ఆ వేల సంఖ్యలోని బుజ్జి ఆక్టోపస్ పిల్లలు రక్షణ కరువై ఒంటరిగా సముద్రపు అలల్లో కొట్టుకుపోతాయి. అలా కొట్టుకుపోయిన వేలాది పిల్లలలో శత్రు జీవుల నుండి తప్పించుకుని కేవలం కొన్ని మాత్రమే ప్రాణాలతో బ్రతకగలవు.
ఒక కొత్త జీవానికి జన్మనివ్వడం కోసం, తమ వంశాన్ని నిలబెట్టడం కోసం ఆక్టోపస్ తల్లిదండ్రులు చేసే ఈ త్యాగం నిజంగా ప్రకృతిలోనే ఒక అద్భుతం అని చెప్పొచ్చు.
