Health Tips:

Health Tips: నిద్ర తక్కువైతే ఇన్ని రోగాలా? ఏ వయసు వారు ఎన్ని గంటలు పడుకోవాలో చూసుకోండి!

Health Tips: ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు ఆఫీస్ మీటింగ్‌ల కోసం ఉదయాన్నే నిద్రలేస్తే, మరికొందరు మొబైల్ ఫోన్లు వాడుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత పడుకుంటున్నారు. దీనివల్ల నిద్ర నాణ్యత దెబ్బతిని, ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తక్కువ నిద్రపోయినా శరీరం మామూలుగానే పనిచేస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే.. మన శరీరానికి, మెదడుకు తిండి ఇంకా నీరు ఎంత అవసరమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అలసట, చిరాకు, బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం ఇలా పలు తీవ్రమైన రోగాల ముప్పు పెరుగుతుంది.

అయితే, ప్రతి వయసులోనూ నిద్ర అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. పుట్టిన చిన్నారికి రోజులో ఎక్కువ గంటల నిద్ర అవసరమైతే, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమయం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆరోగ్య నివేదికల ప్రకారం.. వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇక్కడ సులభంగా తెలుసుకుందాం.

1. పుట్టిన పిల్లలు (0 – 3 నెలలు)

నవజాత శిశువులకు అన్నింటికంటే ఎక్కువ నిద్ర అవసరం. ఎందుకంటే ఈ వయసులోనే వారి శారీరక, మానసిక ఎదుగుదల వేగంగా జరుగుతుంది. వీరు పగలు, రాత్రి కలిపి రోజుకు దాదాపు 14 నుండి 17 గంటల పాటు నిద్రపోవాలి. మంచి నిద్ర వారి శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి బలోపేతం కావడానికి సహాయపడుతుంది. ఈ వయసు పిల్లలు రాత్రిపూట మాటిమాటికీ మేల్కొంటూ, మళ్లీ నిద్రపోతూ ఉంటారు.

2. బడికి వెళ్లే పిల్లలు (6 – 13 సంవత్సరాలు)

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ప్రతిరోజూ 9 నుండి 11 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఈ వయసులో పిల్లలు చదువు, ఆటపాటల్లో ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి తగినంత నిద్రపోవడం వల్ల వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. నిద్ర సరిపోకపోతే పిల్లల్లో చిరాకు, అలసట కనిపిస్తాయి.

3. టీనేజర్లు (14 – 17 సంవత్సరాలు)

కౌమారదశ (Teenage) లో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. అందుకే వీరు రోజుకు 8 నుండి 10 గంటల నిద్ర పోవడం ఎంతో అవసరం. మంచి నిద్ర వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో శక్తి నిలిచి ఉంటుంది. ఈ వయసులో చదువుల ఒత్తిడి, సోషల్ మీడియా , మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల నిద్ర పాడవుతుంది. దీనివల్ల చదువుపై శ్రద్ధ తగ్గడం, కోపం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

4. పెద్దవారు (18 – 64 సంవత్సరాలు)

మీ వయసు గనుక 18 నుండి 64 సంవత్సరాల మధ్య ఉంటే.. మీరు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 7 నుండి 9 గంటల పాటు నిద్రపోవడం ఎంతో మంచిది. తగినంత నిద్రపోవడం వల్ల శరీరానికి పూర్తి విశ్రాంతి దొరుకుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, గుండె, మెదడు హెల్తీగా ఉంటాయి. రోజువారీ నిద్ర తక్కువైతే బరువు పెరగడం (స్థూలకాయం), హై బ్లడ్ ప్రెజర్, షుగర్ వ్యాధి (డయాబెటిస్) నిరంతర అలసట వంటి సమస్యలు వస్తాయి.

5. వృద్ధులు (65 సంవత్సరాలు పైబడిన వారు)

వయసు పైబడే కొద్దీ శరీర పనితీరు బలం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి. కాబట్టి వృద్ధులకు రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర సరిపోతుంది. మంచి నిద్ర వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. అయితే, వయసు పెరగడం వల్ల రాత్రిపూట పదేపదే మేలకువ రావడం, గాఢ నిద్ర లేకపోవడం వంటి సమస్యలు సహజంగానే ఎదురవుతాయి.

Sleep habits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *