Attapur Kidnap Case: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో మంగళవారం (మే 19) అర్ధరాత్రి ఓ యువతి కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. నంబర్ ప్లేట్ లేని ఓ థార్ (Thar) కారులో వచ్చిన నలుగురు యువకులు, రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కారును సినిమా ఫక్కీలో వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దుండగులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు.
ఆరాంఘర్ చౌరస్తా వరకు ఛేజింగ్..
పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. నలుగురు యువకులు ఒకేసారి థార్ కారులో వచ్చి, ఒంటరిగా ఉన్న యువతిని బలవంతంగా లోపలికి లాక్కున్నారు. యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు తక్షణమే అప్రమత్తమై ‘డైల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని, దుండగుల కారును వెంబడించడం ప్రారంభించారు. అత్తాపూర్ నుండి ఆరాంఘర చౌరస్తా వరకు పోలీసులు హైస్పీడ్‌తో కారును వెంటాడినప్పటికీ, రాత్రి వేళ చీకటిని ఆసరాగా చేసుకుని కిడ్నాపర్లు తప్పించుకున్నారు.
నంబర్ ప్లేట్ లేదు.. సీసీటీవీలపైనే భారం!
దుండగులు వాడిన నల్లటి థార్ కారుకు ముందు, వెనుక ఎలాంటి నంబర్ ప్లేట్లు లేకపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీనిని ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసిన కిడ్నాప్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు, బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి దర్యాప్తు సాగించారు. ప్రస్తుతం ఆ రూట్ లోని అన్ని జంక్షన్ల సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ట్విస్ట్: ఇప్పటివరకు రాని కంప్లైంట్!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఇంత పెద్ద ఎత్తున హల్చల్ జరిగినప్పటికీ, బుధవారం ఉదయం వరకు కూడా సదరు యువతికి సంబంధించి ఎలాంటి మిస్సింగ్ కేసు గానీ, కిడ్నాప్ ఫిర్యాదు గానీ ఏ పోలీస్ స్టేషన్లోనూ నమోదు కాలేదు.
అసలు ఆ యువతి ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? అనేది ఇంకా తెలియరాలేదు.ఇది నిజంగానే కిడ్నాపా? లేక తెలిసిన వారే ఎవరైనా గొడవపడి బలవంతంగా తీసుకెళ్లారా? అనే కోణంలోనూ అత్తాపూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాలేజీ విద్యార్థులు లేదా ఐటీ ఉద్యోగుల మధ్య జరిగిన గొడవనా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
