supreme court: హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పార్క్ చుట్టుపక్కల ఉన్న ఈకో-సెన్సిటివ్ జోన్ (పర్యావరణ సున్నిత ప్రాంతం)లో చెట్లను నరకడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడ ఒక్క చెట్టును కూడా తొలగించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఈ ప్రాజెక్టుల కోసం పార్క్ చుట్టుపక్కల దాదాపు 1,300 పెద్ద చెట్లను నరికేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అక్కడ పగలు, రాత్రి తేడా లేకుండా రోజుకు 50 చెట్ల వరకు నరికేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు వేసవి సెలవుల్లో ఉన్న సమయాన్ని చూసుకుని ప్రభుత్వం వేగంగా చెట్లను తొలగిస్తోందని ఆయన వాదించారు.
ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తీరుపై కీలక ప్రశ్నలు వేసింది. “చెట్లను నరకకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదా?” అని ప్రశ్నించింది. గతంలో ఈ పార్క్ చుట్టూ 25 మీటర్లుగా ఉన్న ఈకో-సెన్సిటివ్ జోన్‌ను, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా కేవలం 3 మీటర్లకు తగ్గించడాన్ని కూడా పిటిషనర్ కోర్టుకు వివరించారు.
రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. హైదరాబాద్‌లోనే అతిపెద్ద గ్రీన్ జోన్‌గా ఉన్న కేబీఆర్ పార్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భావించింది. అందుకే తదుపరి విచారణ జరిగే వరకు ఆ 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చెట్ల నరికివేత పనులు జరగడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ రక్షణ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న పర్యావరణవేత్తలకు, హైదరాబాద్ ప్రజలకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది.
