Chandrababu Naidu: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరంతో పాటు ఇతర కీలక ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచి, రైతులకు త్వరగా నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
నీటి నిర్వహణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సాగునీటి సంఘాలను తిరిగి బలోపేతం చేయాలని, నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజల సహకారంతోనే నీటి యాజమాన్య పద్ధతులను విజయవంతంగా అమలు చేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు భూగర్భ జలాల సంరక్షణపై కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వాడుకునేందుకు వీలుగా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం, చెరువులను నింపడం వంటి చర్యల ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచాలని, భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
