Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: కేసీఆర్ ఒక ‘మరమనిషి’.. ప్రజలకే కాదు, బిడ్డకు కూడా దూరమయ్యారు

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు ఉద్యమ సారథిగా వేనోళ్ల పొగిడిన నోటితోనే, ఇప్పుడు ఆయన ఒక “మరమనిషి”లా మారారని విమర్శించడం చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా కాన్క్లేవ్‌లో పాల్గొన్న కవిత, తన తండ్రి కేసీఆర్ పరిపాలనా శైలిపై తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడిన ఆమె, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పులే పార్టీకి, ప్రజలకు దూరం చేశాయని అభిప్రాయపడ్డారు.

ఉద్యమ నాయకుడి నుండి యంత్రంలాంటి ముఖ్యమంత్రి వరకు..

కవిత తన ప్రసంగంలో కేసీఆర్ వ్యక్తిత్వాన్ని రెండు కోణాల్లో విశ్లేషించారు.. తెలంగాణ సాధన కోసం పోరాడిన సమయంలో కేసీఆర్ ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ఉండేవారని, ఆ పాత్రలో ఆయన అద్భుతమని చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేవలం ఒక ‘మరమనిషి’ (Robot) లాగా పనిచేశారని విమర్శించారు. పరిపాలనలో యంత్రంలా మారిపోవడం వల్ల ప్రజల భావోద్వేగాలను, వారి కష్టాలను అర్థం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

“కన్నబిడ్డగా నా సమస్యలే చెప్పుకోలేకపోయాను”

ఈ భేటీలో కవిత చేసిన అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు కుటుంబ సంబంధాలకు సంబంధించినవి.

బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన ఎంత కఠినంగా ఉండేవారంటే, కన్నబిడ్డగా నాకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా ఆయనకు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. సొంత బిడ్డకే అందుబాటులో లేని వ్యక్తి, ఇక సామాన్య ప్రజల మొరను ఎలా వింటారు? అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇంకా సొంత కుటుంబ సభ్యులకు మధ్య ఒక పెద్ద గోడను నిర్మించుకున్నారని, అది చివరకు రాజకీయంగా భారీ నష్టాన్ని చేకూర్చిందని ఆమె పేర్కొన్నారు.

రాజకీయ పరిణామాలకు అదే కారణం!

ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు కేసీఆర్ అనుసరించిన ఏకాంత ధోరణే ప్రధాన కారణమని కవిత కుండబద్ధలు కొట్టారు. ఉద్యమ సమయంలో ఉన్న స్ఫూర్తిని, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అధికారంలో ఉన్నప్పుడు కొనసాగించలేకపోవడమే ఆయన చేసిన పెద్ద తప్పని ఆమె విశ్లేషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *