NEET UG 2026: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET-UG) పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3న జరిగిన పరీక్షను రద్దు చేసిన అధికారులు, తిరిగి జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా మళ్ళీ పరీక్షను నిర్వహించనున్నట్లు కొత్త తేదీని ఖరారు చేశారు.
వివాదాల నేపథ్యంలో పరీక్ష రద్దు
ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష మొదటి నుంచీ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. దేశంలోని కొన్ని పరీక్షా కేంద్రాలలో ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్తలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర విద్యాశాఖ ఇంకా ఎన్టీఏ, పరీక్ష పారదర్శకతపై నీలినీడలు కమ్ముకోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాయి. లక్షలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో, ఇప్పటికే జరిగిన పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
జూన్ 21న రీ-ఎగ్జామ్: పకడ్బందీ ఏర్పాట్లు
తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 21న పరీక్ష జరగనుంది. ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా.
ప్రశ్నపత్రాల పంపిణీలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు, అదనపు భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. కేంద్రాల లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా నిక్కచ్చిగా తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
విద్యార్థులకు సూచనలు
పరీక్షా తేదీ దగ్గర పడుతుండటంతో విద్యార్థులు మళ్ళీ ప్రిపరేషన్‌పై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా జారీ చేసే హాల్ టికెట్లను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
“పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు కొంత ఆవేదనకు గురైన మాట వాస్తవమే, కానీ పారదర్శకమైన ఫలితాల కోసం ఇది అవసరం. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, దొరికిన ఈ కొద్ది సమయాన్ని రివిజన్ కోసం వాడుకోవాలి .. అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఏదైనా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌నే అనుసరించాలని ఎన్టీఏ కోరింది.

