Hyderabad

Hyderabad: గచ్చిబౌలిలో ఘోరం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

Hyderabad: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో బుధవారం ఒక అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్ (5) అనే బాలిక ఈ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

అసలేం జరిగిందంటే?
బతుకుదెరువు కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఒక దంపతులు గచ్చిబౌలిలోని ఒక మహిళా హాస్టల్‌లో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వారికి ఐదేళ్ల కూతురు బిస్తు ఘోష్ ఉంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఆ చిన్నారి ఆడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గ్రిల్ లిఫ్ట్‌లో పై అంతస్తులకు వెళ్ళింది. అయితే, మూడవ అంతస్తుకు చేరుకునే సరికి ప్రమాదవశాత్తు చిన్నారి జుట్టు లిఫ్ట్ ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది. ఆ వేగంతో తల తీవ్రంగా నలిగిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది రాక:
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గచ్చిబౌలి పోలీసులు, హైడ్రా మరియు ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి మృతదేహాన్ని సిబ్బంది ఎంతో శ్రమించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు:
కళ్లముందే ఆడుకుంటూ తిరిగిన చిన్నారి విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *