Chandrababu Naidu

Chandrababu Naidu: పోలవరం పూర్తికి సహకరించండి.. కేంద్రమంత్రిని కోరిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా 2027లో వచ్చే గోదావరి పుష్కరాల నాటికల్లా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయాలన్నదే తమ లక్ష్యమని, దీనికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తాను ఐదుసార్లు ప్రాజెక్టును సందర్శించి పనులను పర్యవేక్షించానని, పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రికి వివరించారు.

ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులను తొలగించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉండటం వల్ల గతంలో ఇచ్చిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ను శాశ్వతంగా రద్దు చేయాలని కోరారు. దీనివల్ల పనులు ఆటంకం లేకుండా సాగుతాయని పేర్కొన్నారు. అలాగే, తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులను పూర్తి చేయాలని, డయాఫ్రం వాల్ మరియు ఇతర డ్యామ్ పనుల పురోగతిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలోని సాగునీటి అవసరాల కోసం పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచామని, ఇందుకు అయిన అదనపు ఖర్చును కేంద్రం భరించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల ఆధునికీకరణ కోసం ‘హర్ ఖేత్ కో పానీ’ పథకం కింద నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 297 నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్లు అవసరమని వివరించారు. రాష్ట్రంలోని సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర పథకాల ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు.

అంతర్రాష్ట్ర జల వివాదాల పైనా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వవద్దని కోరారు. ఒకవేళ ఎత్తు పెంచితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, గోదావరి మిగులు జలాలను రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు తరలించేందుకు ఉద్దేశించిన ‘పోలవరం-బనకచర్ల’ లింక్ ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర మంత్రిని కోరుతూ సీఎం చంద్రబాబు వినతి పత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *