DCP Rakshita: సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో కలకలం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ దారుణ హత్యలో పక్కా ప్లాన్ ఉందని, అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. పట్టుబడిన నిందితుల్లో తొమ్మిది మంది పెద్దలు కాగా, ఒకరు మైనర్ బాలుడు ఉన్నారని తెలిపారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. యావన్ మరియు సదరు యువతి పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. గతంలో యావన్ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతను వినకపోవడంతో, అతడిని అంతం చేయాలని ఐదు రోజుల ముందే ని పథకం వేశారు. యావన్ కదలికలపై నిఘా పెట్టి, అతను తన స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకున్న నిందితులు అక్కడికి వెళ్లి దాడి చేశారు. ఒక నిందితుడు యావన్ను కత్తితో సుమారు 17 సార్లు పొడిచినట్లు డీసీపీ వివరించారు.
ఈ కేసులో అమ్మాయి బావ సాయి కిరణ్ (A1), అన్నయ్య పరమేశ్ (A2), తండ్రి నరసింహ (A7)తో పాటు మరికొందరు బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి హత్యకు వాడిన కత్తి, బైక్ మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, రాహుల్ మరియు శివనందన్ అనే ఇద్దరు యువకులకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా యువతకు డీసీపీ రక్షిత కీలక సూచనలు చేశారు. కేవలం 19 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఇలాంటి నేరాల్లో పాల్గొని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు అలవాట్లకు, ఆవేశాలకు లోనుకాకుండా క్రమశిక్షణతో ఉండాలని, ఇలాంటి నేరాలకు పాల్పడి జీవితాలను జైలు పాలు చేసుకోవద్దని ఆమె కోరారు.
