Tamil Nadu: తమిళనాడులో గత ఆరు రోజులుగా ఊపిరి బిగబట్టేలా సాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గవర్నర్‌కు, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మధ్య నడిచిన సందిగ్ధత ముగిసి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం క్లియర్ అయ్యింది. ఇప్పటివరకు ఉన్న మద్దతుకు తోడుగా, తాజాగా వీసీకే (VCK) మరియు ముస్లిం లీగ్ పార్టీలు కూడా విజయ్‌కు జై కొట్టాయి. ఈ రెండు పార్టీల రాకతో విజయ్ బలం ఏకంగా 120కి చేరుకుంది. దీంతో అసెంబ్లీలో స్పష్టమైన ఆధిక్యం లభించినట్లయింది.
ఈ కీలక పరిణామాల నేపథ్యంలో, మరికాసేపట్లో విజయ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలవబోతున్నారు. తన వద్ద ఉన్న 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు స్వయంగా అందజేయనున్నారు. ఈ లేఖను గవర్నర్ పరిశీలించిన తర్వాత, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా ఆహ్వానించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో విజయ్ తదుపరి అడుగుల పైనే అందరి కళ్లు ఉన్నాయి.
అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ నెలకొంది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉంటూ తమిళనాడు అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ రాత్రికి కేరళ వెళ్లాల్సి ఉంది. మరి విజయ్ భేటీ తర్వాత గవర్నర్ తన పర్యటనను వాయిదా వేసుకుంటారా? లేక ఆయన వెళ్లేలోపే ప్రక్రియ పూర్తి చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గవర్నర్ తన పర్యటనను కొనసాగిస్తే, పరిస్థితులు మళ్లీ మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందుకే, పరిస్థితులు అనుకూలిస్తే ఈ రాత్రికే విజయ్ ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీవీకే శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. గవర్నర్‌తో భేటీ ముగిసిన వెంటనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ రాత్రి అత్యంత కీలకం కాబోతోంది. విజయ్ అభిమానులు మాత్రం తమ నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే క్షణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
