Suvendu Adhikari

Suvendu Adhikari: బెంగాల్ పీఠంపై కాషాయ జెండా.. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం!

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి, ఇప్పుడు అదే బెంగాల్‌ గడ్డపై బీజేపీ జెండాను ఎగురవేశారు. శనివారం జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆయన బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ అపూర్వ ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రమాణ స్వీకారంలా కాకుండా, బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగింది. మమతా బెనర్జీ సాధారణంగా తెల్లచీర, రబ్బరు చెప్పులతో ఎంత నిరాడంబరంగా ఉంటారో.. సువేందు కూడా అంతే సాదాసీదాగా కాషాయ రంగు కుర్తా ధరించి వేదికపైకి వచ్చారు. ఆయనతో పాటు అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్ వంటి కీలక నేతలు కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన గడ్డపై అధికారం దక్కించుకోవడాన్ని బీజేపీ తమ పార్టీ గౌరవంగా భావిస్తోంది.

బిజెపి ఈ వేడుక కోసం మే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ఆ రోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. బీజేపీ అంటే కేవలం ఉత్తర భారత పార్టీ అని, దానికి బెంగాలీ సంస్కృతిపై గౌరవం లేదని ప్రత్యర్థులు చేసే విమర్శలకు సమాధానం చెప్పడానికే ఈ తేదీని నిర్ణయించారు. దీని ద్వారా తాము బెంగాలీ ఆచారాలకు, గొప్ప వ్యక్తులకు ఎంతో విలువ ఇస్తామని బీజేపీ చాటిచెప్పింది.

ఇక సభా ప్రాంగణమైన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ అంతా బెంగాలీ వాతావరణంతో నిండిపోయింది. ప్రజల కోసం ప్రత్యేకంగా 20 రకాల మిఠాయి దుకాణాలను, బెంగాల్ ఫేమస్ స్నాక్ ‘ఝల్మురీ’ (మరమరాల మిశ్రమం) స్టాళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ప్రధాని మోడీ స్వయంగా ఈ ఝల్మురీని రుచి చూడటంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొత్తానికి, బెంగాలీ సంప్రదాయాలను మేళవిస్తూ జరిగిన ఈ కార్యక్రమం అటు రాజకీయంగా, ఇటు సాంస్కృతికంగా అందరినీ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *