Bandi Sanjay: హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారం వల్లే ఆయన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి అమీర్‌పేట వరకు జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి.
బీఆర్ఎస్ నాయకత్వంపై, ముఖ్యంగా కేటీఆర్ వైఖరిపై బండి సంజయ్ ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చూపించిన అహంకారం వల్లే ప్రజలు ఆ పార్టీని ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు.
నాకు అవేవీ తెలియదు – కేటీఆర్‌కు బండి కౌంటర్
కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు కౌంటర్‌గా బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాదిరిగా తనకు కొన్ని పనులు చేయడం తెలియదంటూ పలు అంశాలను ప్రస్తావించారు.
ప్రజల సొమ్మును దోచుకోవడం తనకు తెలియదని పేర్కొన్నారు. రైతులకు బేడీలు వేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం తనకు తెలియదన్నారు. డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఫాంహౌజ్ డ్రగ్స్ కేసుల గురించి కానీ తనకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ-ఫార్ములా రేసింగ్, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి వంటివి తనకు తెలియవని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడం, ఇతరుల జీవితాలను నాశనం చేయడం తనకు తెలియదని విమర్శించారు.
అధికారం పోయాక మారుతున్న తీరు
బీఆర్ఎస్ నాయకులు అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో అహంకారంతో వ్యవహరించిన కేటీఆర్, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కార్యకర్తల కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కేటీఆర్ తీరును అసహ్యించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యమని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కేంద్రం నుండి నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ నేతలు తెలంగాణ సంపదను ఢిల్లీలోని తమ పార్టీ పెద్దలకు పంపుతున్నారని విమర్శించారు. ఇదే సమావేశంలో బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోటి దురుసుతనం వల్లనే వారి పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
