Crime News: సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో గురువారం రాత్రి ఒక యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కేవలం ప్రేమ వ్యవహారం కారణంగానే కత్తులతో వెంటాడి వేటాడి చంపడం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. చదువుకుని ప్రయోజకుడు కావాల్సిన ఒక బీటెక్ విద్యార్థి ఇలా శవమై పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అసలేం జరిగింది?
పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన యువన్ అనే 21 ఏళ్ల యువకుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతంలో యువన్ చిలకలగూడలోని ఇందిరానగర్‌లో నివసించేవాడు. ఆ సమయంలోనే అక్కడ ఉండే ఒక యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం యువన్ కుటుంబం యాప్రాల్‌కు మారినప్పటికీ, తన ప్రేయసిని కలిసేందుకు అతను తరచూ ఇందిరానగర్‌కు వస్తుండేవాడు.
పథకం ప్రకారం దాడి:
గురువారం రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన స్నేహితులతో కలిసి ఇందిరానగర్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా.. అకస్మాత్తుగా రెండు బైక్‌లపై ఏడుగురు యువకులు అక్కడకు చేరుకున్నారు. వారు యువన్‌తో గొడవకు దిగి, వెంట తెచ్చుకున్న కత్తులతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో యువన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితులు అతడిని వదలకుండా వెంటాడి మరీ విచక్షణారహితంగా పొడిచారు.
ఘటనా స్థలంలోనే మృతి:
తల, మెడ, చేతులపై సుమారు 15 చోట్ల కత్తులతో పొడవడంతో యువన్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణానికి పాల్పడింది ఆ యువతి సోదరులు మరియు వారి స్నేహితులేనని ప్రాథమిక సమాచారం అందుతోంది. తమ సోదరితో యువన్ ప్రేమలో ఉండటం ఇష్టం లేకే, వారు పక్కా ప్లాన్‌తో ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు:
సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘాతుకం జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
