Siddipet

Siddipet: సిద్దిపేటలో తీరని విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు స్నేహితుల మృతి

Siddipet: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్‌రెడ్డి (27)గా గుర్తించారు. చిన్న వయసులోనే ముగ్గురు స్నేహితులు ఒకేసారి మరణించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంతా బుధవారం నాచారంలోని లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వెళ్లారు. దైవదర్శనం ముగిసిన తర్వాత సమీపంలోని హల్దీ వాగు దగ్గరకు వెళ్లారు. అక్కడ వికాస్, ఆనంద్ రెడ్డి స్నానం చేయడానికి నీటిలోకి దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీటి ప్రవాహంలో చిక్కుకుని మునిగిపోసాగారు. గట్టుపై ఉన్న మరో స్నేహితుడు ప్రశాంత్, తన స్నేహితులను కాపాడాలనే ఆరాటంతో వెంటనే నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తూ ప్రశాంత్‌కు కూడా ఈత రాకపోవడంతో ముగ్గురూ నీటిలో మునిగి గల్లంతయ్యారు.

గాలింపు చర్యలు.. మృతదేహాల లభ్యం
యువకులు కనిపించకుండా పోవడంతో గురువారం ఉదయం గౌరారం పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ల సహాయంతో హల్దీ వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంటల తరబడి శ్రమించిన తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *