KTR

KTR: రైతు డిక్లరేషన్ అమలుపై కేటీఆర్ విమర్శల దాడి.. రేవంత్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు.

KTR: వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సామాన్య రైతులను నయవంచనకు గురిచేసిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలను నమ్మి రైతులు ఓట్లు వేశారని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నిర్వహించిన రైతు మేళాను ఆయన ‘దగా మేళా’గా అభివర్ణించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రేవంత్ రెడ్డి ఒక ‘రెగ్యులర్ సీఎం’ కాదని, ఆయన ఒక ‘రెన్యువల్ సీఎం’ అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి ప్రతి నెలా కప్పం కడుతూ తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కంటే రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడమే ప్రభుత్వానికి ముఖ్యంగా మారిందని, అందుకే రైతు బంధు నిధులు ఆగిపోయాయని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పేరులోని ‘ఎ’ అంటే ‘ఎగవేత’ అని, రుణమాఫీ వంటి హామీల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.

రుణమాఫీ అంశంపై కేటీఆర్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దామని, అక్కడ రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి రేవంత్ రెడ్డి సిద్ధమా? లేక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. చెడ్డీ గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ ప్రమాదకరమని, ప్రజలు ఈ మోసాలను గమనించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *