Pawan Kalyan: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం మరియు పుదుచ్చేరి ఎన్నికల్లో ఓటర్లు చూపించిన చైతన్యాన్ని ఆయన మనసారా అభినందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అన్నింటికంటే గొప్పదని, ప్రజలు మార్పును కోరుకుంటే అది ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ఈ ఫలితాలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు. పాలన నచ్చకపోతే ఓటర్లు నిర్దాక్షిణ్యంగా మార్పును ఆహ్వానిస్తారని ఈ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన భారీ విజయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంపై బెంగాల్ ప్రజలు నమ్మకం ఉంచారని ఆయన కొనియాడారు. బెంగాల్ సురక్షితంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మోదీ నాయకత్వమే సరైనదని అక్కడి ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. ఈ ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన మోదీ, అమిత్ షాతో పాటు స్థానిక నేతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ సంచలనంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం సాధారణ విషయం కాదని, విజయ్ను తాను మనసారా అభినందిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. అలాగే కేరళలో మార్పును కోరుకుని విజయాన్ని అందించిన యూడీఎఫ్ కూటమికి, అసోంలో వరుస విజయాన్ని అందుకున్న హిమంత్ బిశ్వశర్మకు, పుదుచ్చేరిలో గెలిచిన రంగసామికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
