Pawan Kalyan: బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఒక భారతీయ మహిళకు అక్కడ నరకం కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ, మస్కట్‌లో తన యజమాని (సేఠ్) పెడుతున్న చిత్రహింసల నుండి కాపాడాలంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వేడుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అందరినీ కలిచివేస్తోంది.
బిడ్డల చదువు కోసం వెళ్లి.. బందీగా మారి..
షానల్ తన ముగ్గురు పిల్లలను చదివించుకోవాలనే తపనతో, అప్పులు చేసి కొద్దిరోజుల క్రితమే ఒక ఏజెంట్ ద్వారా మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఆమె పరిస్థితి దారుణంగా మారింది.
అక్కడ సేఠ్ తనను ఒక గదిలో బంధించి, కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వకుండా నిత్యం కొడుతున్నాడని ఆమె రోదిస్తూ చెప్పారు. తనకు ఫిట్స్ వస్తున్నాయని, సరైన సమయానికి చికిత్స అందక చనిపోయేలా ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యజమానికి తెలియకుండా బాత్రూంలో ఈ వీడియో చేశానని, ఒకవేళ అతనికి తెలిస్తే తనను చంపేస్తాడని ఆమె కంటతడి పెట్టారు.
పవన్ అన్నే నాకు దిక్కు
తనకు మాట్లాడే సమయం కూడా లేదని, అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నానని చెబుతూ షానల్ వీడియో రిలీజ్ చేసింది అందులో పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను ఎలాగైనా కాపాడి నా ముగ్గురు బిడ్డలకు రక్షణ కల్పించండి. నేను చనిపోతే నా పిల్లలను పోషించే దిక్కు లేదు” అంటూ ఆమె చేసిన రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
