Fire Accident: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి నోష్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లోని మూడవ బ్లాక్‌లో కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
రియాక్టర్ పేలిన ధాటికి కంపెనీ ప్రాంగణం నుంచి దట్టమైన తెల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. భారీ శబ్దం రావడంతో స్థానిక గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా స్పందించారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఈ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కంపెనీని సీజ్ చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
