KTR: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రైతుల సంక్షేమం గురించి సీఎం కేవలం స్పీచ్‌లు, డైలాగ్‌లు మాత్రమే ఇస్తున్నారని, క్షేత్రస్థాయిలో వారికి జరుగుతున్న మేలేమీ లేదని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే, ‘రైతు భరోసా’ నిధులను వాయిదాల పద్ధతిలో ఎందుకు ఇస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ఎవరు వచ్చినా రైతు బంధు ఆగదని కొందరు గొప్పలు చెప్పారని, కానీ ఇప్పుడు నిధులు సకాలంలో అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోందని, సాగుకు అవసరమైన వనరులు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆరోపించారు. కేవలం రైతులనే కాకుండా విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో విజయవంతంగా కొనసాగించామని, కానీ ఇప్పుడు ఆ నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు.
ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో కొంత నిరుత్సాహం రావడం సహజమని కేటీఆర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ, అవాంతరాలు ఎదురైనా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
