Supreme Court: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు నమోదైన కేసులో, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, అలాగే ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కలిగించాలని ఆయన కోరగా, అత్యున్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీనితో ఆయనకు ఈ కేసులో ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు.
గతంలో ఈ మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరిని రిమాండ్‌కు పంపాలని కోరుతూ పోలీసులు కుప్పం ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, అప్పట్లో కోర్టు ఆ విన్నపాన్ని తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా, కుప్పం కోర్టు ఇచ్చిన పాత ఆదేశాలను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని శ్రీహరిని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పూడి శ్రీహరి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం, కుప్పం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. అయితే, శ్రీహరి కోరుకున్న విధంగా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం అంగీకరించలేదు. దీనితో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
