Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఈ సమస్యపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు చమురు సంస్థల ప్రతినిధులతో అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని, వెంటనే సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం అధికారులను గట్టిగా ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీయగా, చమురు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఉదయం నుంచే డిపోల నుండి ట్యాంకర్లు బయలుదేరాయని, ఈరోజు సాయంత్రం కల్లా రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ పెట్రోల్ బంకులకు నిల్వలు చేరుకుంటాయని అధికారులు వివరించారు. దీనివల్ల రాత్రి కల్లా రాష్ట్రంలో ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే డిపోల వద్దకు వెళ్లి ట్యాంకర్ల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి క్షేత్రస్థాయి నివేదికలను తనకు పంపాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా ప్రతి జిల్లాలోని పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో కొందరు పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్ చేసే అవకాశం ఉందని, అక్రమ నిల్వలు ఉంచినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులను హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.
