TG 10th Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఏప్రిల్ 16వ తేదీతో ముగిసిన టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల తదుపరి ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. పరీక్షలు రాసిన విద్యార్థుల సమాధాన పత్రాల దిద్దడం ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పేపర్ల స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ముగిసిన వెంటనే విద్యార్థుల మార్కుల నమోదు, ట్యాబ్యులేషన్ పనులను అధికారులు ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది ఫలితాలను మే మొదటి వారంలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే, మే 4 లేదా 5వ తేదీల్లో పదో తరగతి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో జాప్యం లేకుండా ఉండేందుకు అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మార్కుల క్రోడీకరణకు పట్టే 10 రోజుల సమయాన్ని కూడా తగ్గించి, వీలైనంత త్వరగా రిజల్ట్స్ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు.
విద్యార్థులు తమ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ప్రముఖ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. అయితే, ఈ ఏడాది నుంచి విద్యాశాఖ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు పొందే అవకాశం కల్పించిన బోర్డు, ఇప్పుడు రిజల్ట్స్ కూడా అదే పద్ధతిలో అందించనుంది.
ఫలితాలు తెలుసుకోవాలనుకునే వారు 80969 58096 అనే నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ వచ్చే సూచనల ప్రకారం ‘SSC Results’ అని టైప్ చేసి, హాల్‌టికెట్ నంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేస్తే చాలు. వెంటనే మీ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీనివల్ల ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా, సులభంగా మొబైల్‌లోనే ఫలితాలు చూసుకునే వీలుంటుంది.
