Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని లక్కేపూర్ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రాణాల మీదికి తెచ్చింది. తన తల్లిని ఇంట్లోకి రానివ్వడం లేదన్న కోపంతో, ఒక తమ్ముడు సొంత అన్ననే సజీవ దహనం చేయడానికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రఘు, అనిల్ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తల్లిని ఇంట్లో ఉంచుకునే విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తల్లిని రఘు ఇంట్లోకి రానివ్వడం లేదని అనిల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న అనిల్, ఆదివారం రాత్రి రఘు నిద్రిస్తున్న సమయంలో కిటికీలోంచి లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రఘు కేకలు వేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే రఘుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు ఇలా ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
