Ramchander Rao

Ramchander Rao: కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు.. కవిత కొత్త పార్టీపై బీజేపీ నేత సెటైర్లు

Ramchander Rao: కల్వకుంట్ల కవిత తాజాగా తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అనే కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తనదైన శైలిలో స్పందించారు. కొత్త పార్టీలు రావడం పెద్ద విషయం కాదని, గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేదే ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.

రామచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటూ విమర్శలు గుప్పించారు. పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్లో నమ్మకం రాదని, ఏ పార్టీ ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తుందో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాజకీయాల్లో కొత్త పార్టీల ప్రకటనలు సహజమని, కానీ ప్రజల మద్దతు ఉన్న పార్టీయే నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *