Preethi Reddy

Preethi Reddy: కమలం గూటికి మల్లారెడ్డి కోడలు?.. బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు ప్రీతి రెడ్డి.

Preethi Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ ఆమె బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారితో భేటీ అయ్యారు. పార్టీ ఆఫీస్‌కు వెళ్లి ముఖ్య నాయకులతో ఆమె చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

నిజానికి మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తోందనే ప్రచారం గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఇటీవల మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఆ భేటీ జరిగిన కొద్ది రోజుల్లోనే, ఇప్పుడు కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ కార్యాలయానికి రావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. రెండు రోజుల క్రితమే ఆమె బీజేపీ సీనియర్ నాయకులు రామచందర్‌రావును కూడా కలిశారు.

వరుసగా జరుగుతున్న ఈ భేటీలను చూస్తుంటే, మల్లారెడ్డి కుటుంబం త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రీతిరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా లేక కుటుంబం తరపున చర్చలు జరుపుతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, మల్లారెడ్డి కుటుంబం అడుగులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *