TCS Nashik Office Case: ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ యూనిట్లో చోటుచేసుకున్న వరుస సంఘటనలు ఇప్పుడు ఐటీ రంగంలో సంచలనం రేపుతున్నాయి. ఉద్యోగినులపై లైంగిక వేధింపులు ఇంకా బలవంతపు మతమార్పిడి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై టీసీఎస్ యాజమాన్యం స్పందిస్తూ, వాస్తవాలను వెలికితీసేందుకు ఒక ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.
అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఇదే..
2022లో ఒక మహిళా ఉద్యోగి తన సహోద్యోగి డానిష్ షేక్ పై చేసిన ఫిర్యాదుతో ఈ ఉదంతం మొదలైంది. నిందితుడు తనకు అప్పటికే వివాహమైన విషయాన్ని దాచిపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. నిదా ఖాన్ అసలు డానిష్ సోదరి కాదని చెప్పింది, బాధితురాలిని మతం మారాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమె మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, మరో ఏడుగురు మహిళా ఉద్యోగినులు ముందుకు వచ్చి తమపై జరిగిన వేధింపులను వివరించారు. ఫిబ్రవరి 2022 నుండి మార్చి 2026 మధ్య కాలంలో సీనియర్ అధికారులు తమను వేధింపులకు గురిచేశారని, హెచ్ఆర్ విభాగానికి మొరపెట్టుకున్నా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
టీసీఎస్ స్పందన: “మాకు ఫిర్యాదులు అందలేదు”
ఈ ఆరోపణలపై టీసీఎస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “మా అంతర్గత రికార్డులను పరిశీలించగా, ఎథిక్స్ లేదా POSH (లైంగిక వేధింపుల నిరోధక) విభాగాలకు ఈ తరహా ఫిర్యాదులు ఏవీ అందలేదని ప్రాథమికంగా తేలింది” అని సంస్థ పేర్కొంది. అయినప్పటికీ, ఆరోపణల తీవ్రత దృష్ట్యా సమగ్ర విచారణ చేపడుతున్నట్లు తెలిపింది.
-
కేకి మిస్త్రీ కమిటీ: ఫైనాన్స్ రంగ నిపుణుడు కేకి మిస్త్రీ నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.
-
సస్పెన్షన్: ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు ఉద్యోగులను కంపెనీ ఇప్పటికే సస్పెండ్ చేసింది.
పరారీలో నిదా ఖాన్.. పోలీసుల గాలింపు
ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె కోసం థానే జిల్లాలో గాలింపు చేపట్టారు. ఆమె ప్రస్తుతం గర్భవతి అని, ముంబైలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆమె నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
టాటా సన్స్ ఛైర్మన్ దిగ్భ్రాంతి
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “లైంగిక వేధింపుల ఆరోపణలు వినడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. దీనిపై క్షుణ్ణంగా అంతర్గత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన ప్రకటించారు.
