SRH vs CSK

SRH vs CSK: హైదరాబాద్‌తో చెన్నై ఢీ.. ధోనీ రాకతో CSK హ్యాట్రిక్ కొడుతుందా?

SRH vs CSK: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠభరిత పోరుకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు చెరో 4 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ, రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్ పట్టికలో పైస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-4 లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.

చెన్నైకి సవాళ్లు – ధోనీ ఎంట్రీ:
వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న చెన్నైకి స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం పెద్ద దెబ్బ అని చెప్పాలి. సీజన్ మొత్తానికి అతను దూరం కావడంతో ముఖేష్ చౌదరి లేదా మాట్ హెన్రీలలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, మూడు వారాల విరామం తర్వాత ఎంఎస్ ధోనీ జట్టుతో చేరడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ, అతను తుది జట్టులో ఆడతాడా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు బ్యాటింగ్‌లో సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తక్కువ స్ట్రైక్ రేట్‌తో తడబడటం ఆందోళన కలిగిస్తోంది.

కుర్రాళ్లపైనే హైదరాబాద్ ఆశలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి యువ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అనుభవం తక్కువ ఉన్నప్పటికీ ప్రఫుల్ హింజ్, షకీబ్ హుస్సేన్ వంటి యువ బౌలర్లు తమ అరంగేట్రంలోనే అదృరగొట్టారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్‌లో ఉండగా, మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి మెరుపులు మెరిపిస్తున్నారు. ఏప్రిల్ 25 తర్వాత పాట్ కమిన్స్ జట్టుతో చేరనుండటంతో అప్పటివరకు ఈ యువ దళమే జట్టును నడిపించాల్సి ఉంటుంది.

పిచ్ పరిస్థితి ఎలా ఉంది?
గత మ్యాచ్‌లో ఇదే పిచ్‌పై హైదరాబాద్ జట్టు 216 పరుగులు సాధించి భారీ స్కోరును నమోదు చేసింది. అయితే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పిచ్ స్వభావం కొద్దిగా మారే అవకాశం ఉంది. బంతి నెమ్మదిగా వచ్చే అవకాశం ఉన్నందున బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా, ఇరు జట్లు బలంగా ఉండటంతో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. మీరు ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *