Amit shah

Amit shah: సీట్ల పునర్విభజనపై క్లారిటీ..’సౌత్’ కు అన్యాయం జరగనివ్వం.. అమిత్ షా హామీ!

Amit shah: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై వస్తున్న అనుమానాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పటాపంచలు చేశారు. పార్లమెంట్‌లో సీట్లు పెరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందన్న విపక్షాల విమర్శల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా అమలు చేయబోయే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం సీట్ల సంఖ్య పెరగడమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల బలం కూడా పెరుగుతుందని ఆయన వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా:
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 సీట్లు 38కి చేరుతాయి. అలాగే, తెలంగాణలో ఇప్పుడున్న 17 సీట్లు 26కి పెరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. అంటే తెలుగు ప్రజల గొంతు పార్లమెంట్‌లో మరింత బలంగా వినిపించే అవకాశం కలుగుతుంది.

దక్షిణాది రాష్ట్రాల వారీగా అంచనాలు:
కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపు ఆశాజనకంగా ఉంది. కర్ణాటకలో సీట్ల సంఖ్య 28 నుంచి 42కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతాయని కేంద్రం అంచనా వేసింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల మొత్తం ఎంపీల సంఖ్య 129 నుంచి 195కి చేరుతుంది. పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యం ప్రస్తుతమున్న 23.76 శాతం నుండి 23.97 శాతానికి మెరుగుపడుతుందే తప్ప తగ్గదని గణాంకాలతో సహా నిరూపించారు.

మహిళా రిజర్వేషన్ల ప్రభావం:
ఈ సీట్ల పెంపు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే. పెరిగిన స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చట్టసభల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం ఉండటంతో మహిళా నాయకత్వం మరింత బలోపేతం అవుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రజలు అవాస్తవాలను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *