Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాంకేతిక రంగంలో మరో అద్భుత మైలురాయిని చేరుకుంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే ‘క్వాంటం వ్యాలీ’గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్వాంటం కంప్యూటర్ దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రెండు కీలక కేంద్రాలను ప్రారంభించారు. ఎస్ఆర్ఎం (SRM) యూనివర్సిటీలో 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీని, అలాగే మేధా టవర్స్‌లో ‘1Q’ పేరుతో మరో క్వాంటం సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండు కేంద్రాలు క్వాంటం పరికరాలను పరీక్షించడానికి, వాటికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ప్రధాన వేదికలుగా పనిచేస్తాయి. దీనివల్ల పరిశోధకులు, విద్యార్థులు మరియు కొత్త కంపెనీలకు క్వాంటం టెక్నాలజీని ఉపయోగించుకునే గొప్ప అవకాశం లభిస్తుంది.
టెక్నాలజీ ప్రాధాన్యతను వివరిస్తూ.. పారిశ్రామిక రంగానికి విద్యుత్, డిజిటల్ రంగానికి ఇంటర్నెట్ ఎంత అవసరమో, రాబోయే కాలంలో ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ అంతే కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రంగంలో ముందున్న దేశాలే భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎనిమిది నెలల స్వల్ప కాలంలోనే ఈ ప్రాజెక్టును వాస్తవ రూపంలోకి తీసుకురావడం విశేషమని, ఇది రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు.
దేశంలో టెక్నాలజీని ప్రోత్సహించే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో సహకరించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మరియు ఇతర అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్వాంటం సైన్స్ పుట్టి వందేళ్లు పూర్తయిన తరుణంలో, ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమరావతిలో ప్రారంభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన ఆకాంక్షించారు.
