Trisha: ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. చెన్నైలోని టైనంపేట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ పంపారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు త్రిష ఇంటికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
బాంబ్ స్క్వాడ్ బృందం ప్రత్యేక జాగిలాలతో కలిసి ఇంటి మూలమూలలా సోదాలు నిర్వహించింది. అయితే, ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి బాంబులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఆ బెదిరింపు కేవలం ఒక ఫేక్ కాల్ పోలీసులు నిర్ధారించారు. నటి త్రిష కుటుంబ సభ్యులు ఈ ఘటనతో కాస్త ఆందోళనకు గురైనప్పటికీ, తనిఖీల తర్వాత అంతా ప్రశాంతంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కి ఉంది. ఈ సమయంలోనే ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం. మరోవైపు, స్టార్ హీరో విజయ్‌తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ కలిసి ఒక పెళ్లికి హాజరుకావడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం విజయ్ తన కొత్త పార్టీ ‘టీవీకే’ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఈ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి ఆకతాయి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. త్రిష ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
