KTR: తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నేతగా పేరున్న టీ. జీవన్ రెడ్డి అధికారికంగా భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన అహంకారంతో జీవన్ రెడ్డి వంటి పెద్దలను అవమానిస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్, జీవన్ రెడ్డిల మధ్య ఉన్న 40 ఏళ్ల స్నేహాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014లోనే ఆయనను పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ, నాడు కాంగ్రెస్ పట్ల ఉన్న నిబద్ధతతో ఆయన రాలేదని, కానీ నేడు రేవంత్ రెడ్డి పద్ధతి నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను వంచించడం, సీనియర్లను గౌరవించకపోవడం వంటి చర్యల వల్ల కాంగ్రెస్ పతనం మొదలైందని కేటీఆర్ విమర్శించారు. జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞుల రాకతో బీఆర్ఎస్కు కొత్త బలం చేకూరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. తాను ఎందరో గొప్ప ముఖ్యమంత్రుల పాలనను చూశానని, కానీ వారందరికంటే కేసీఆర్ పాలనే ప్రజలకు ఎంతో మేలు చేసిందని కొనియాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఈ రెండేళ్లలోనే రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు జరుగుతున్న అవమానాలను భరించలేకే తాను బయటకు వచ్చానని స్పష్టం చేశారు.
తన రాజకీయ జీవితం చివరి దశలో ఉందని, ఈ సమయంలో పాత మిత్రుడైన కేసీఆర్తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం రుణమాఫీని సరిగ్గా అమలు చేయలేదని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. త్వరలోనే హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ను కలవనున్నట్లు ఆయన తెలిపారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో వెన్నెముకలా ఉన్న జీవన్ రెడ్డి వంటి నాయకుడు పార్టీ వీడటం, తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద వికెట్ పడినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
