Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి, ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలు, పాలనా వైఫల్యాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీసింది.
రేవంత్ రెడ్డి తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రేవంత్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని, పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ప్రచారానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ నాయకత్వం లేదా రాహుల్ గాంధీ మార్క్ ఎక్కడా కనిపించడం లేదని, పార్టీలో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మనస్తాపంతో పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ, రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లుగా కేసీఆర్‌తో పోరాడినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే ఎంతో మెరుగ్గా ఉందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించామని, కానీ రేవంత్ హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఉన్న అనుభవం, స్పష్టత ప్రస్తుత ప్రభుత్వంలో లోపించాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని, అది కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి స్పష్టత ఇస్తానని ఆయన వెల్లడించారు. ఒక సీనియర్ నేత ఇలా కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు.
