YS Sharmila: షర్మిల షాకింగ్ కామెంట్స్..’అప్పుడు రుషికొండ.. ఇప్పుడు మావిగన్!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కేవలం వైఎస్‌ఆర్ పేరును వాడుకుంటున్నారు తప్ప, ఆయన ఆశయాలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ రాజకీయ తీరును ఎండగట్టారు. వైఎస్‌ఆర్ భావజాలం నిజంగా ఉంటే, ఆయన కలల ప్రాజెక్టు అయిన ‘జలయజ్ఞం’ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.

గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకించారని, కానీ జగన్ మాత్రం ఆ పార్టీకి ‘దత్తపుత్రుడి’లా మారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నప్పుడు జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరు చెప్పి రుషికొండను తవ్వేశారని, అక్కడ ప్రజల కోసం కాకుండా తన సొంత ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక ‘జోకర్‌’లా మిగిలిపోయారని విమర్శించారు.

“మాట తప్పం మడమ తిప్పం” అనే మాటను జగన్ కేవలం ప్రచారానికే వాడుకున్నారని షర్మిల మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం విధిస్తానని నమ్మించి, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం అమ్ముతూ “ఓన్లీ క్యాష్” మాఫియాను నడిపించారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. వైఎస్‌ఆర్ వారసుడంటే ఆయన మార్గంలో నడవాలి కానీ, ఇలా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదని షర్మిల స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *