Kavitha

Kavitha: ప్రభుత్వానివి అబద్ధపు హామీలు.. విపక్షానివి నిద్రమత్తు చర్యలు

Kavitha: తెలంగాణ భవిష్యత్తును మార్చడమే లక్ష్యంగా ఈ నెల 25వ తేదీన ఒక సరికొత్త ఎజెండాతో ముందుకు రాబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కొత్త రక్తం, సరికొత్త రాజకీయ ఆలోచనలతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని కవిత విమర్శించారు. తెలంగాణ పాలన మొత్తం ఢిల్లీ నుంచే జరుగుతోందని, మన రాష్ట్రం కాంగ్రెస్‌కు ఒక ఏటీఎంలా మారిందని ఆమె ఆరోపించారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిద్రపోతోందని, అచేతన స్థితిలో ఉందంటూ మండిపడ్డారు. గద్వాల ప్రాంతంలో చేనేత కార్మికులు, పత్తి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం లేదని ఆమె దుయ్యబట్టారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి ఎప్పుడూ ముందుంటుందని కవిత స్పష్టం చేశారు. “ప్రశ్నిస్తాం.. పోరాడతాం.. పరిష్కరిస్తాం” అనే నినాదంతో వెలుగుమట్ల తరహాలో నిరంతరం ప్రజల మధ్యే ఉండి పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. గతంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసినప్పుడు జోగులాంబ జిల్లాలో జాగృతికి మంచి విజయం దక్కిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో గద్వాల గడీ మీద ఉద్యమకారుల జెండా ఎగరడం ఖాయమని, మొదటి అసెంబ్లీ విజయం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *